బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడికి బీఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం
*బోరు మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని శంభీపూర్ క్రిష్ణ హామీ*
దుండిగల్ మేజర్ న్యూస్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ డివిజన్ ఇందిరమ్మ కాలనీ బ్లాక్-11కు చెందిన రాజు కుమారుడు ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదంలో కాలుకు గాయం కావడంతో చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న యువకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచి సహాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలోని సభ్యుల సమస్యలను తెలుసుకుంటూ అవసరమైన సమయంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని శంభీపూర్ క్రిష్ణ తెలిపారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన ఆయన స్థానికులు వినియోగిస్తున్న బోరును పరిశీలించారు. బోరు పాడైపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
బోరుకు అవసరమైన మరమ్మతులు త్వరితగతిన చేపట్టి తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళీయాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, సీనియర్ నాయకులు ఎస్వీ సురేందర్‌రెడ్డి, బైండ్ల గోపాల్, వార్డు అధ్యక్షుడు కామేశ్వరరావు, నాయకులు బాబీ, వంశీ, గోపాల్, సూర్య, శ్యామ్, లక్ష్మణ్, భూషణ్, ఆనంద్, గోపి, దిలీప్, తిరుపతిరెడ్డి, గోపాల్ తదితరులతో పాటు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.