అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం
నూగూరు వెంకటాపురం, మేజర్ న్యూస్, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించే నిరుపేదలకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని,అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ రేషన్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు,స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మండలవ్యాప్తంగా 501 మంది లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లు,స్మార్ట్ రేషన్ కార్డులను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వృద్ధులు, దివ్యాంగులు,నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని,స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సదుపాయాలు పొందేందుకు వీలవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాల అమలులో సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రావు,జిల్లా కాంగ్రెస్ నాయకుడు మన్యం సునీల్ బాబు,యువ నాయకుడు బాలసాని వేణు,కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిట్యాల సాగర్,నాయకులు గుండమల్ల కిరణ్ ,డర్ర రవి, గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చక్రధర్ ,వెంకటాపూర్, ములుగు జిల్లా