జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని
నెక్కొండ, మేజర్ న్యూస్, జిల్లా స్థాయి క్రీడా పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా ఛాంపియన్‌గా నిలిచిన మాలోత్ చిన్నిని బుధవారం రెడ్లవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
నెక్కొండ మండలంలోని భవిత కేంద్రంలో చిన్ననాటి నుంచి విద్యాభ్యాసం చేసిన మాలోత్ చిన్ని, ప్రస్తుతం రెడ్లవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పుట్టుకతోనే వినికిడి, మాట సంబంధిత వైకల్యం ఉన్నప్పటికీ, తన పట్టుదల, కృషి, క్రీడా ప్రతిభతో జిల్లా స్థాయి పోటీలలో దాదాపు అన్ని క్రీడల్లో ప్రథమ స్థానాలు సాధించి జిల్లా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఫీల్డ్ మెమొంటో, ప్రశంసా పత్రాన్ని అందుకొని అందరి ప్రశంసలు పొందింది.
చిన్నికి లభించిన విజయాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో సర్పంచ్ దగ్గు సంతోష్, వార్డు సభ్యుడు వెంకన్న, ప్రధానోపాధ్యాయుడు బి. సురేష్, సీఎడబ్ల్యూఎస్ఎన్ ఐఈఆర్పీ అంజయ్య, సీనియర్ ఉపాధ్యాయులు బి. సుదర్శన్, పొలోజు భిక్షపతి, ఎ. ధాల్సింగ్, ఎ. రమాదేవి, కె. శ్రీధర్ తదితరులు పాల్గొని చిన్నిని అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉన్నత విజయాలు సాధించేందుకు తోడ్పడాలని, చిన్ని విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.
రిపోర్టర్: శ్రవణ్, నర్సంపేట, వరంగల్ జిల్లా