విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం శతాబ్ద కాలం నాటి ఆధ్యాత్మిక వారసత్వానికి పునర్వైభవం తీసుకొస్తూ కడియం మండలం వీరవరం గ్రామంలో శ్రీరామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో తొలిరోజు గోపూజ,యాగశాల ప్రవేశం, విశేష పూజలు, కలశారాధనలు వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 108 కలశాలతో ముత్తైదువులు నిర్వహించిన గ్రామోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వేడుకలను కనులారా తిలకించారు.
వీరవరం గ్రామంలోని సొసైటీ వీధిలో పునర్నిర్మించిన శ్రీరామాలయంలో శ్రీ గణపతి సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ మరియు షిరిడి సాయిబాబా వార్ల దివ్య శిలా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 7.05 గంటలకు గోపూజతో ప్రారంభమైన కార్యక్రమాల్లో యాగశాల ప్రవేశం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశనం, రక్షాబంధనం, నవగ్రహ, అష్టదిక్పాలకారాధనలు, కలశారాధనలు, అగ్ని ప్రతిష్ఠాపన తదితర వైదిక క్రతువులు నిర్వహించారు.
19వ తేదీ రెండో రోజైన గురువారం ఉదయం 6.45 గంటలకు వివిధ దేవతామూర్తులకు పుష్పపూజలు, మండలారాధనలు, ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రతిష్ఠా విగ్రహాల గ్రామోత్సవం, సాయంత్రం ఉదకశాంతి, బలిదానం, క్షేత్రపాలకారాధన తదితర కార్యక్రమాలు జరగనున్నాయి.
20న ప్రధాన ఘట్టం..
ఉదయం 9.36కు విగ్రహ ప్రతిష్ఠ
శుక్రవారం ఉదయం 6.10 గంటల నుంచి గర్భన్యాసం, రత్నన్యాసం, బీజన్యాసం, యంత్రస్థాపన, ప్రాణప్రతిష్ఠాపన, విగ్రహ కళాన్యాసం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9.36 గంటలకు శ్రీరామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుండగా ఉదయం 11 గంటల నుంచి అన్నసమారాధన ఏర్పాటు చేశారు.
బ్రహ్మశ్రీ దొంతంశెట్టి కాళహస్తీశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో బండారులంకకు చెందిన ప్రముఖ సైవాగమన పండితులు కారుపర్తి చెన్న మల్లేశ్వరరావు శిష్య బృందం వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
దాతలకు గుర్తింపు.. గ్రామ చరిత్రకు అక్షరరూపం
ఆలయ నిర్మాణానికి రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందించిన దాతల పేర్లను శిలాఫలకాలపై లిఖించనున్నారు. అలాగే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయ విశేషాలు, పూర్వీకుల సేవలు, గ్రామ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు 'గుడి–బడి (గ్రామాల చరిత్ర)' కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఆలయ కమిటీలు, గ్రామ పెద్దలు, దాతలు, భక్తుల సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.