ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని త్రీ టౌన్ సీఐ అప్పారావు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరి నగర్, వాంబే అపార్ట్‌మెంట్ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కాలనీ వాసులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీఐ అప్పారావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.