సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా
వరంగల్, మేజర్ న్యూస్, ఎచ్ ఐ వి, ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను విజయవంతంగా సాధించి వరంగల్ జిల్లా ప్రతిష్టాత్మకమైన “సురక్షిత్ జిల్లా గుర్తింపును సాధించింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఆదేశాల మేరకు, జిల్లా సాధించిన ఈ విజయానికి గుర్తింపుగా బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఇందిర జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాకు సురక్షిత్ జిల్లా గుర్తింపు రావడం అన్ని శాఖల అధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషి, అంకితభావం మరియు సమన్వయంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత పట్టుదలతో కృషి చేసి “సురక్షిత్ ప్లస్ స్థాయిని సాధించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. బి.రాజారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వప్న మాధురి, అకౌంటెంట్ కమలాకర్, నాగరాజు, సహయోగి మంజుల, ఎన్ జి ఓ ప్రతినిధులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: సంతోష్, వరంగల్ ,వరంగల్ జిల్లా