అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం
కొల్చారం;ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు బాలల హక్కులను కాపాడుతూ, బాల కార్మికులు లేని ఆదర్శ గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా సహన సంస్థ పనిచేస్తోందని సంస్థ ప్రతినిధి సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా కొల్చారం మండలంలోని అంసానిపల్లి గ్రామంలో సహన సంస్థ ఆధ్వర్యంలో, మల్లారెడ్డి ఆసుపత్రి సహకారంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రామన్న గీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామన్న గీత మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న సహన సంస్థ ప్రతినిధులకు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.సహన సంస్థ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు, అన్ని గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మికుల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఫణీందర్ కుమార్, గ్రామ సర్పంచ్ గీత రమేష్ , వార్డు సభ్యులు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రీతం కుమార్ రెడ్డి, డాక్టర్ శివ సాత్విక, నర్సింగ్ సిబ్బంది పావని, నందిని, ఫాతిమా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నాగప్ప, మేనేజర్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.