అంగన్‌వాడీ టీచర్ల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతర కృషి -- నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీ ఏర్పాటు
నారాయణపేట, సూర్యన్యూస్: భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉషారాణి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ మోహన్ జీ, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి బాలు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ మోహన్ జీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు చిన్నారుల సంరక్షణ, పోషకాహారం అందించడం, ప్రాథమిక విద్యాబోధనతో పాటు మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ భవిష్యత్తుకు పునాదులైన చిన్నారుల అభివృద్ధిలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అంగన్‌వాడీ టీచర్లకు ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి) సదుపాయం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు భారతీయ మజ్దూర్ సంఘ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
*నూతన కమిటీ ఎన్నిక*
ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. నూతన కమిటీ అధ్యక్షురాలుగా సావిత్రి (భైరంకొండ), ఉపాధ్యక్షురాలుగా సువర్ణ (ఎక్లాస్‌పూర్), ప్రధాన కార్యదర్శిగా లక్ష్మి (వందర్ గుట్ట తండా), కార్యదర్శిగా పద్మ (సింగారం), కోశాధికారిగా హారిక (భైరంకొండ), కార్యనిర్వాహక సభ్యులుగా బాల కిష్టమ్మ (అవాంగపూర్), శారద (పేరపల్ల)లు ఎంపికయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు అంగన్‌వాడీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడాలని, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉషారాణి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ మోహన్ జీ, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి బాలు యాదవ్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.