గోమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
నవాబుపేట, మేజర్ న్యూస్: గోమాత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, గోవుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని, గోరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.నవాబుపేట మండలం వట్టిమీనపల్లి గ్రామంలో హిందూ జనశక్తి, శివశక్తి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాల దివ్య ప్రాణప్రతిష్ఠ, స్థాపన మహోత్సవాలు వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ… భారతీయ సంస్కృతిలో గోవును గోమాతగా ఆరాధించే సంప్రదాయం ఉందని, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణలో గోవుల పాత్ర కీలకమని వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న గోవులకు ఆశ్రయం కల్పించడంలో గోశాలలు ముందుండాలని సూచించారు. గోమయం, సేంద్రియ ఎరువులు, సహజ వ్యవసాయం ద్వారా రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా గోక్షేత్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గోసేవ అనేది కేవలం ధార్మిక కార్యక్రమం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.గోక్షేత్రాలు గోవుల సంరక్షణతో పాటు భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే కేంద్రాలుగా ఎదగాలని అన్నారు. శ్రీ అదితి గోక్షేత్రం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్, శివశక్తి వ్యవస్థాపకుడు కరుణాకర్ సుగుణ, హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, శివశక్తి ప్రతినిధి కళ్యాణ్ కుమార్, గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, దగ్గుల శ్రీహరి గౌడ్, కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి వెంకటయ్య, నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి, నవాబుపేట సర్పంచ్ నరసింహారెడ్డి, పులుమామిడి సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువులు, వేద పండితులు, గోసేవకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.