కొడంగల్, దుద్యాల నూతన పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్
కొడంగల్/దుద్యాల, మేజర్ న్యూస్: కొడంగల్, దుద్యాల మండలాల్లో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన పోలీస్ స్టేషన్ భవనాలను సందర్శించి నిర్మాణ పనులు, కార్యాలయ గదులు, పోలీస్ సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… నూతన పోలీస్ స్టేషన్ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు ఫిర్యాదుదారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. పోలీసు సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.