అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం!
సంగారెడ్డి;కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారో లేదో కాలమే నిర్ణయిస్తుందని, అయితే ప్రధానమంత్రి పదవి తమ కుటుంబంలోనే పుట్టిందని వ్యాఖ్యానించారు.2004లో సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంపీలంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారని, అయినప్పటికీ వారు ఆ పదవిని స్వీకరించకుండా మన్మోహన్ సింగ్‌కు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ సైతం రాహుల్ గాంధీని ఆ పదవి చేపట్టాలని కోరగా, ఆయన తిరస్కరించారని పేర్కొన్నారు.రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా వద్దా అనేది దేశ ప్రజలు, ఓటర్లు నిర్ణయిస్తారని, అమిత్ షాకు ఆ విషయంలో శాసించే హక్కు లేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా అవుతారని ధీమా వ్యక్తం చేశారు.రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా పనిచేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందని, బీజేపీకి అంతటి బలం లేదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్‌గా తీసుకుంటుందని ప్రకటించారు.శ్రీరాముడి పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అయితే శ్రీరాముడి అడుగుజాడల్లో పాలన సాగించడం లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే శ్రీరాముడి పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ రాముడిని భజించారని, అప్పటికి బీజేపీ పార్టీనే పుట్టలేదని, మోదీ, అమిత్ షాలు కూడా రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో బీజేపీ ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తోందని, పటేల్ నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన కాంగ్రెస్ నాయకుడని గుర్తుచేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రస్తావించారు.
నెహ్రూ, గాంధీ కుటుంబాలు ఎప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాయని పేర్కొంటూ, అమిత్ షా అహంకారపూరిత వ్యాఖ్యలకు ఎన్నికల్లో ప్రజల తీర్పుతో సమాధానం చెబుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.