వేదిక్ వర్సిటీలో ఐకేఎస్ పరిశోధనా కేంద్రం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ విభాగం సౌజన్యంతో ఎస్వీ వేదిక్ వర్సిటీలో ప్రతిష్టాత్మక పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. బుధవారం వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్సిటీ విసి గణపతి భట్, మాజీ వీసీ కేఈ దేవనాథన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేద విశ్వవిద్యాలయంలో నూతనంగా ఐకేఎస్ పరిశోధనా కేంద్రం హర్షనీయమని పేర్కొన్నారు. యావత్ వేద విశ్వవిద్యాలయాన్ని ఒక సమగ్ర ఐకేఎస్ కేంద్రంగానే భావించాలని స్పష్టం చేశారు. ఆధునిక ప్రపంచానికి భారతీయ వైదిక విద్యలను సమగ్రంగా శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసే వారికి తగిన చేయూతనివ్వడమే ఐకేఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వేద విశ్వవిద్యాలయంలో నిరంతరం సాగే పరిశోధనలు, అధ్యయనాలన్నీ అదే దిశగా సాగుతున్నాయని సంస్థ విశిష్టతను గుర్తుచేశారు. వేదాలు మూలంగా కలిగిన సనాతన భారతీయ జ్ఞాన పరంపర ప్రపంచంలోనే అత్యున్నతమైనదని కొనియాడారు. ఐకేఎస్ రీసెర్చ్ సెంటర్ మంజూరు కావడం ఎంతో గర్వకారణమని, పరిశోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగం డైరెక్టర్, ఐకేఎస్ సెంటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ ఎ వెంకట రాధేశ్యామ్ వేదిక్ ఇన్సైట్. ఆన్ ప్రాణ అండ్ లైఫ్ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ తారక రామకుమార శర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ బలభద్ర ఉపాధ్యాయ, ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి, పీఆర్వో డాక్టర్ గంజాం రామకృష్ణ, వివిధ విభాగాల డీన్లు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్