telanagana
వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.90 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసింది. వికారాబాద్ పట్టణంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంతో పాటు మోమిన్‌పేట మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.వికారాబాద్ పట్టణంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవన నిర్మాణానికి రూ.1.40 కోట్ల నిధులు కేటాయించింది. నిర్మాణ పనులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీహెచ్సీఎల్), హైదరాబాద్‌కు అప్పగిస్తూ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు జీవో జారీ చేశారు.అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక ఎకరం స్థలంలో రూ.2.25 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. నిర్మాణ పనులను హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట మండల కేంద్రంలోనూ నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక్కడ కూడా ఒక ఎకరం స్థలంలో రూ.2.25 కోట్ల వ్యయంతో కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ మూడు కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించి మొత్తం రూ.5.90 కోట్ల నిధులతో ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.