బుచ్చిలో ఇద్దరు టిడిపి సీనియర్ల రాజీనామా
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఇద్దరు సీనియర్ టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. మండలంలోని రేబాల గ్రామానికి చెందిన మాజీ పెన్నా డెల్టా చైర్మన్ యర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పంచేడు గ్రామంలో ని సూరా శ్రీనివాసులు రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ మేరకు తెలియజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించామని, ఎన్నికల సమయంలో అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తూ ఎవరిని పోటీలో నిలిపితే రాత్రింబవళ్లు కష్టపడి వారిని గెలిపించా మన్నారు. ఈరోజు వరకు కూడా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎంపి ప్రభాకర్ రెడ్డి లతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో తన కుటుంబ సభ్యులకు గానీ, శ్రీనివాసులు రెడ్డి కుటుంబంలో గాని చైర్మన్ టికెట్ కేటాయించమని అడగడం జరిగిందని,వారు తిరస్కరించడంతో విలువలు లేని చోట ఉండకూడదనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో తెలియజేస్తామన్నారు.వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సురా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దంపతులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, బయటివారు వచ్చి తమ మండలంలో పెత్తనం చాలా ఇస్తుంటే తమ మనోభావాలు దెబ్బ తినడంతో పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి మన్నేపల్లి శ్రీనివాసులు, గోవర్ధన్ రెడ్డి అనుచరులు,అభిమానులు, సూరా శ్రీనివాసులురెడ్డి అనుచరులు అభిమానులు భారీగా పాల్గొన్నారు.