telanagana
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ:కాంగ్రెస్ దోమ మండల అధ్యక్షుడు శాంతు కుమార్
దోమ, మేజర్ న్యూస్: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ దోమ మండల అధ్యక్షుడు శాంతు కుమార్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారుతోందని పేర్కొన్నారు. గురువారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామానికి చెందిన అనారోగ్య బాధితులకు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామమోహన్రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాంతు కుమార్ మాట్లాడుతూ.. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయని అన్నారు. అనారోగ్యం కారణంగా కుటుంబ పెద్దలు, సంపాదించే వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చికిత్స కోసం అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం పేదలకు పెద్ద సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందడం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ఈ పథకం కీలకంగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. బొంపల్లి గ్రామానికి చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు కావడానికి సహకరించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామమోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చాపల బద్రి, దోమ, వికారాబాద్ జిల్లా.