బిట్స్ కాలేజీలో డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
పొదిలి, మేజర్ న్యూస్
స్థానిక బిట్స్ బెల్లంకొండ కాలేజీలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ప్రతినిధులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఖాదర్ బాషా మాట్లాడుతూ
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ, తన నిరంతర శ్రమ, నిజాయితీలతో భారతమాత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన మహానీయుడని కొనియాడారు.
రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా సెక్రటరీ బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ
కలాం బాల్యంలో చింతపిక్కలు అమ్మడం, పత్రికలు పంపిణీ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో చదువుకుని, ప్రపంచం గర్వించే గొప్ప శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా ఎదిగారని పేర్కొన్నారు. సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన నిరూపించారన్నారు. విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్
డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇస్రో, డి ఆర్ డి ఓ లలో కలాం కీలక బాధ్యతలు నిర్వర్తించారని, ఆయన రూపకల్పన చేసిన సూపర్సానిక్ లక్షభేదక విమానం, ఎస్ ఎల్ వి-3 ప్రాజెక్టులు ఎన్నో ప్రశంసలందుకున్నాయని గుర్తుచేశారు. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, భారతరత్న పురస్కారాలతో సత్కరించిందని, రాష్ట్రపతిగా ఆయన ప్రజల రాష్ట్రపతిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. హబీబుల్లో ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బెగ్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్ తోట శ్రీనివాసులు మాట్లాడుతూ విశ్వంలో ఎందరో జన్మించిన కొందరు మాత్రమే మహా పురుషులుగా వెలుగుందుతారని వారిలో కలాం ఒకరు అని చెప్పారు. కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అనే పిలుపు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని వివరించారు. కార్యక్రమంలో ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ మెహరజ్, లెక్చరర్లు షేక్ హామీద ,జి భార్గవ నాయుడు ,కాలేజీ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.