నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ!
కావలి మేజర్ న్యూస్ : కావలి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి వీధిలో నివాస ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గోల్డ్ రిఫైనరీ నిర్వహిస్తున్నారని స్థానికుడు పోలిశెట్టి సురేష్ బాబు ఆరోపించారు. గురువారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఇంటి పక్కనే నివసిస్తున్న సందీప్ అనే వ్యక్తి మూడో అంతస్తులో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లైసెన్సులు లేకుండా బంగారం కరిగించడం, విదేశీ ముద్రలతో బంగారు బిస్కెట్లు తయారు చేయడం వంటి పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ శుద్ధి ప్రక్రియలో ఉపయోగిస్తున్న ప్రమాదకర రసాయనాల వల్ల నివాస ప్రాంతంలో వాయు కాలుష్యం ఏర్పడి, తనతో పాటు తన భార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశామని సురేష్ బాబు తెలిపారు. అధికారులు స్థలాన్ని పరిశీలించి, పరిశ్రమకు ఎలాంటి లైసెన్సులు లేవని స్పష్టం చేస్తూ, పరిశ్రమను ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించాలని నోటీసులు ఇచ్చినా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
తక్షణ చర్యలకు డిమాండ్: జనావాసాల మధ్య ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రిఫైనరీపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.