ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ నిఘా: తనిఖీలు, పాత నేరస్తులకు హెచ్చరికలు.
కావలి మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ/ఎంపీటీసీ మరియు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెల్లూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ మరియు కావలి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్తులకు హెచ్చరిక: బోగోలు, కప్పరాళ్లతిప్ప గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు చేసే పాత నేరస్తులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడవద్దని ఖరాకండిగా హెచ్చరించారు. బోగోలు సమీపంలోని గంగతిప్ప, కప్పరాళ్లతిప్ప సమీపంలోని నక్కలగుంట అటవీ ప్రాంతాలలో అధికారులు సమగ్రంగా గాలించారు. వాహనాల తనిఖీ: ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి-16 పై ఎక్సైజ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, సుంకం చెల్లించని మద్యం మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ఈ సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో నెల్లూరు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో పాటు కావలి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానికంగా అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కావలి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. వెంకటరావు తెలిపారు.