దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే
దేశ మాజీ రాష్ట్రపతి, భారత క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గురువారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన కృషి, పట్టుదల, ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించారని గుర్తుచేశారు. శాస్త్రవేత్తగా దేశ రక్షణ రంగానికి విశేష సేవలందించడంతోపాటు రాష్ట్రపతిగా ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ముఖ్యంగా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని, విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, సీనియర్ నాయకులు పరమేష్, అశోక్, శ్రీధర్ చారి,పృథ్వీరాజ్, వెంకటేష్, ఆశమ్, కొండల్, శ్యామ్, షకీల్, రామ్మోహన్, వీరారెడ్డితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.