సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్టీయూసీ పాలాభిషేకం
సూర్య, సెంటినరీ కాలనీ ;సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రయోజనాలను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-1 ఆపరేషన్ సైట్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం మొదటి షిఫ్ట్ ప్రారంభ సమయంలో ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ డాక్టర్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మికులకు పలు ప్రయోజనాలను ప్రకటించిందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా, కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ఆర్థిక ప్రయోజనం, రూ.1,754 కోట్ల లాభాల్లో వాటాగా ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,54,000 అందే అవకాశం వంటి ప్రకటనలు కార్మికుల్లో ఆనందాన్ని నింపాయని అన్నారు. సొంతింటి పథకం అమలుకు చర్యలు, పెర్క్స్పై ఆధారిత ఆదాయపు పన్ను మినహాయింపు, మారుపేర్ల సమస్య పరిష్కారం, అధికారులకు పీఆర్పీ చెల్లింపు వంటి నిర్ణయాలు కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు. డిస్మిస్ అయిన కార్మికులకు వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా తిరిగి ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పించడం, పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలకు 15 రోజుల్లో నియామక పత్రాలు అందించే చర్యలు, మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను ఏరియా ఆసుపత్రిలోనే నిర్వహించడం, ఆసుపత్రుల అభివృద్ధి, కార్మికుల క్వార్టర్ల ఆధునికీకరణ వంటి నిర్ణయాలు కార్మిక కుటుంబాలకు మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త గనుల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యత లభించలేదని నరసింహారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి సహకారంతో సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త గనులు ప్రారంభమైతే సంస్థ మనుగడకు భరోసా కలగడంతో పాటు కార్మికులకు ఉపాధి భద్రత, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సంక్షేమ నిర్ణయాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ఐఎన్టీయూసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఎన్టీయూసీ నాయకులు వడ్డేపల్లి దాసు, ఆర్జీ-3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి, ఏరియా కార్యదర్శి శ్రీనివాసరావు, ఓసీ-1 పిట్ కార్యదర్శి తోకల ప్రవీణ్ రెడ్డి, సీహెచ్పీ పిట్ కార్యదర్శి కిషన్ నాయక్, ఐఎన్టీయూసీ నాయకులు ఎం. ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ సలీం, నరేష్ కుమార్, రవి కుమార్, గంధం శ్రీనివాస్, సాతిని నాగరాజు, లక్ష్మణాచారి, చంద్రయ్య, జంజర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.