అంబాజీపేట ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యం :అశ్విని హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ ఇంచార్జ్ మోకా
అంబాజీపేట మేజర్ న్యూస్ :మండల కేంద్రమైన అంబాజీపేట వాసుల చిరకాల కోరిక నెరవేరింది. పట్టణంలో అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని తల్లి పిల్లల ఆసుపత్రిని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మోకా ఆనందసాగర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తల్లీబిడ్డల ఆరోగ్యమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువులకు సకాలంలో మెరుగైన వైద్యం అందడం ఎంతో కీలకమన్నారు.అంబాజీపేట వంటి ప్రాంతంలో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ తల్లి పిల్లల ఆసుపత్రి రావడం హర్షణీయమని,ఈ ఆసుపత్రి తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టీడీపీ ఇంచార్జ్ మోకా ఆనందసాగర్ పలువురు నాయకులు మాట్లాడుతూ ఇన్నాళ్లు చిన్న అనారోగ్యానికే అమలాపురం,కాకినాడ, రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, అశ్విని హాస్పిటల్ రాకతో ఆ తిప్పలు తప్పాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ప్రయాణ భారం, సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.ఆసుపత్రి వైద్యులు డా. గుబ్బల త్రినాథ్, డా.జి.అనూష లు మాట్లాడుతూ తమ ఆసుపత్రి ప్రత్యేకతలను వివరించారు.
డా. గుబ్బల త్రినాథ్ (నవజాత మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు)పిల్లలకు అన్ని రకాల టీకాలు, అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలు, నవజాత శిశువుల కామెర్లు, దగ్గు, ఆయాసం, జ్వరాలు, నిమోనియా, పిల్లల ఎదుగుదల, పోషకాహార సమస్యలు అత్యాధునిక పరికరాలతో చూడబడునని తెలిపారు.డా. జి. అనూష (ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణులు) మాట్లాడుతూ మహిళలకు నార్మల్, సిజేరియన్ డెలివరీలు, అతి రక్తస్రావ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భసంచి వ్యాధులు, సంతానలేమి సమస్యలు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్లు, జనరల్ కేసులు చూడబడునని, అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు శిరిగినీడి వెంకటేశ్వరరావు, బొంతు పెదబాబు, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ జి.వి.రాఘవులు, అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.