వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన అదనపు ఎస్పీ చిత్తరంజన్
సూర్య, జైనూర్: చైతన్యం – డ్రగ్స్పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా జైనూర్లో నిర్వహించిన సబ్ డివిజన్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, డీఎస్పీ అశోక్ కుమార్ మార్గదర్శకత్వంలో, సీఐ రమేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి మండలాలకు చెందిన 65 జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో దేవుగూడ జట్టు ప్రథమ, రాసిమెట్ట జట్టు ద్వితీయ, శివనూరు జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చిత్తరంజన్ విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకొని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జైనూర్ ఎస్సై రవికుమార్, పోలీసు సిబ్బంది, సర్పంచులు, సార్మెడీలు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.