అభివృద్ధిపై చర్చకు సిద్ధం
మరిపెడ, మేజర్ న్యూస్,.డోర్నకల్ నియోజక వర్గంలో గత మూడేండ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి, బీఆర్ఎస్ పాలనలో పదెండ్ల పాటు జరిగిన అవినీతి పై ఎక్కడైనా చర్చకు సిద్దమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ సవాల్ విసిరారు. శుక్రవారం పట్టణలోని భార్గవ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిపెడ, చిన్నగూడూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నియోజక వర్గం అణచివేతకు గురైందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే డబల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో, ప్రభుత్వ బియ్యం పంపిణీ లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, బెల్లం, ఇసుక మాఫియా లో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను తీసుకొచ్చానని గుర్తుచేశారు. వీటిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్దమని, దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాం రెడ్డి సర్వోత్తమ రెడ్డిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు కృషి చేయాలనీ కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,రాష్ట్ర యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు, మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్,బుచ్చి రెడ్డి, అంబరీష, కుడితి నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :,చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా