సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు నగరంలోని దుర్గామిట్టలో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకారానికి అమెరికాకు చెందిన బండారు మధుసూధన్ రెడ్డి, రజనీ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు పలకలు, పెన్నులు పంపిణీ చేశారు.
అనంతరం ఆలయంలో నిర్వహించిన సంపుటీకరణ చండీ హోమానికి సి.యం.ఆర్ అధినేతలు మావూరి శ్రీనివాస రావు, భద్రావతి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలాగే శ్రీ సుందరేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాస పూజలకు నెల్లూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి, శ్రీకళ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, సాయంత్రం జరిగిన ప్రత్యేక పుష్పాలంకారానికి ఏలూరు శివనారాయణ, శిరీష దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, ఉత్సవాల్లో ఆఖరి మూడు రోజులైన ఈ నెల 18, 19, 20 తేదీలలో భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ ప్రదక్షిణలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాలను ఆలయ సహాయ కమీషనర్ , కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ముఖ్య ఉత్సవ అధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష పర్యవేక్షించారు.