వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :
నెల్లూరు రూరల్ మండలం వేదగిరి క్షేత్రముగా వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శుక్ర వారం శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు
విజయలక్ష్మిగా కొలువై భక్తులకు అభయ ప్రదానం చేశారు . ఉదయం ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం, శ్రీసూక్త హోమాలు-పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి,లక్ష్మి దంపతులు వ్యవహరించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భముగా దేవస్థానములో ఈనెల 11 వ తేదినుండి 20 వ తేదీ వరకు శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారని చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర రెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగoగా ఏడవ రోజు శనివారము అమ్మవారికి (సప్తమి - మూలానక్షత్రము) సరస్వతి అలంకారము, శ్రీసూక్త హోమాలు నిర్వహించనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో దేవస్థానము కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి, ముఖ్య అర్చక స్వామి అర్చకం మాధవగిరి భాస్కరాచార్యులు, మాధవగిరి వెంకట అప్పలాచార్యులు, మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు, మాధవగిరి లక్ష్మీనరసింహ మూర్తి, అంగులూరి రమానాధాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఉభయకర్తల కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని, అమ్మవారిని దర్శించి, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.