ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు
రైతుల ఇబ్బందులపై స్పందించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం.. రేపే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని అధికారుల హామీ
ఖమ్మం రూరల్ రూరల్ సూర్య మేజర్ న్యూస్ , అక్టోబర్ 15: ఖమ్మం రూరల్ మండలం అరేకోడు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్ మంజూరైనా, దానిని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా సుమారు 100 ఎకరాల వరి పంటకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో నీరు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై అరేకోడు గ్రామ రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రంను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన వీరభద్రం సంబంధిత అధికారులతో మాట్లాడి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కాకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన అధికారులు రేపే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రైతులు ఊరట వ్యక్తం చేస్తూ, తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రంకు, సహకరించిన కాంగ్రెస్ నాయకులకు అరేకోడు గ్రామ రైతులు ధన్యవాదాలు తెలిపారు.
రైతుల ఆశ ఒక్కటే.. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వెంటనే పూర్తిచేసి, తమ వరి పంటకు సకాలంలో సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.