telanagana
ఎల్నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Telanagana
15 Oct 2026
45 views
సూర్య కరీంనగర్ ప్రతినిధి ;ఎల్నినో నేపథ్యంలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కాకుండా, సమస్యలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.గురువారం ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎల్నినో నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ శాఖల సన్నద్ధతపై చర్చించారు. ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ, భూగర్భజల శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రిజర్వాయర్ల నీటిమట్టాలపై నిరంతర పర్యవేక్షణ
రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. నీటి లభ్యతపై నిరంతరం సమీక్షిస్తూ, సమస్యలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు
విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాలు, నీటి సరఫరా వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై
ప్రత్యేక దృష్టి
ఎక్కడ సమస్య తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, దాని అమలుపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పక్కా ప్రణాళికలతో రావాలి
ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై వచ్చే గురువారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. అప్పటిలోగా ప్రతి శాఖ అధికారి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని రావాలని ఆదేశించారు. సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు.
ట్యాగ్లు:
Latest News