డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు
భీమవరం, సూర్య న్యూస్: విద్యావేత్త, సేవాతత్పరుడు డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతిని పురస్కరించుకుని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం పరిసర ప్రాంతాల్లో గురువారం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం కళాశాల వద్ద ఉన్న డాక్టర్ బి.వి. రాజు సమాధి వద్ద సంస్థ ప్రతినిధులు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన 20 మంది పాఠశాల విద్యార్థులకు మొత్తం రూ.85 వేల మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు.
శృంగవృక్షంలోని ఫాదర్ ఎఫ్.ఎం.ఎల్.ఆర్. సెంటర్లో 100 మంది కుష్టు బాధితులకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి, వారి పోషణ కోసం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. సెయింట్ మేరీస్ కుష్టు నివారణ కేంద్రానికి రూ.90 వేల చెక్కును అందజేయడంతో పాటు బాధితులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. భీమవరం ఏడో వార్డులోని కుష్టు కాలనీలో 112 మందికి బెడ్షీట్లు, బియ్యం అందజేశారు. అదేవిధంగా కుముదవల్లి, డాక్టర్ బి.హెచ్.వి.ఎన్. రాజుపురం, కొవ్వాడ అన్నవరంలోని బి.వి. రాజు కాలనీ, యనమదుర్రు తదితర ప్రాంతాల్లోనూ పేదలకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలను పంపిణీ చేశారు.
భీమవరం పట్టణంలోని డాక్టర్ బి.వి. రాజు మార్గ్తో పాటు డాక్టర్ బీవీ రాజు మున్సిపల్ పార్క్ లో ఉన్న ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలో పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా డాక్టర్ బి.వి. రాజు ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలోని పేదలు, నిరుపేదలు, బాధితులకు అండగా నిలిచారు.
ఈ కార్యక్రమాల్లో శ్రీ విష్ణు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్య, సామాజిక సేవకు విశేష ప్రాధాన్యమిచ్చిన డాక్టర్ బి.వి. రాజు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ఘనమైన నివాళిగా నిలిచింది.