స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల.
కావలి మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గ పరిధిలో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కావలి నియోజకవర్గ పరిధిలోని కావలి, దగదర్తి, బోగోలు, అల్లూరు మండలాలకు సంబంధించి జవహర్ భారతి కళాశాలలో ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న ముందస్తు ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాల్స్ వద్ద పక్కాగా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయం తదితర కనీస అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది రాకపోకలు, పోలింగ్ సామాగ్రి రవాణా, వాహనాల పార్కింగ్ విషయంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శాఖల సమన్వయం: ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, సజావుగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కావలి ఆర్డీవో ఎలీషా బాబు, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.