విశ్వవిద్యాలయ వనరులతో... ఉపాధి సృష్టికర్తలగా ఎదగాలి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి
విశ్వవిద్యాలయ వనరులతో.. ఉపాధి సృష్టికర్తలుగా ఎదగాలి!
– ఆదిత్య యూనివర్శిటీ ఛాన్సలర్ డా. ఎన్. శేషారెడ్డి
● ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు
● ప్రతిభావంతులైన ఆచార్యుల జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
● వినూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా మలచుకోవాలి: డా. ఎలియా తాగరం
● ఆదిత్యలో స్టార్టప్ సదస్సు.. విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం
● శిక్షణ, సహకార అవకాశాలపై అవగాహన.. సందేహాలకు సమాధానాలు
ఒకప్పుడు చదువు పూర్తయితే ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం. ఇప్పుడు ఆ చదువుతోనే కొత్త ఆవిష్కరణలు చేయాలి. సొంత ఆలోచనలకు రూపమివ్వాలి. ఉద్యోగం కోసం ఎదురుచూసే స్థాయి నుంచి వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి. అందుకు పుస్తకాల్లోని పాఠాలే కాదు.. అనుభవజ్ఞులైన ఆచార్యుల జ్ఞానం, పరిశోధన సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అండగా నిలవాలి. ప్రతిభకు అవకాశాలు తోడైతే ఒక విద్యార్థి ఆలోచనే కొత్త సంస్థకు పునాది కావచ్చు. అలాంటి ఆవిష్కర్తలను తీర్చిదిద్దడమే ఉన్నత విద్య అసలు లక్ష్యమన్న సందేశంతో సురంపాలెంలోని ఆదిత్య యూనివర్శిటీలో స్టార్టప్ సదస్సు సాగింది
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
సురంపాలెం, అక్టోబరు 15: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, వాటిని కొత్త వ్యాపారాలుగా మలచుకునే అవకాశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఆదిత్య యూనివర్శిటీలో గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ డా. ఎన్. శేషారెడ్డి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండియా (ఎన్సీఐఈ ఇండియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎలియా తాగరం స్టార్టప్‌ల స్థాపనకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.
ఆచార్యుల జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన ఆచార్యులను ఎంపిక చేసి తీసుకొస్తున్నామని ఛాన్సలర్ డా. ఎన్. శేషారెడ్డి తెలిపారు. వారి అనుభవం, అపారమైన జ్ఞానం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది కావాలన్నారు. అటువంటి ఆచార్యుల దగ్గర చదువుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారు అందించే జ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని, పరిశోధనలు చేసి ఆవిష్కరణలకు రూపమివ్వాలని ఆకాంక్షించారు.
చదువు పూర్తయ్యాక ఎవరో ఉద్యోగం ఇస్తారని ఎదురుచూసే స్థాయిలో కాకుండా, తామే వందల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు. తమ విద్యార్థులు ఆవిష్కర్తలుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడినప్పుడే విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.
ఆలోచనలకు స్టార్టప్ రూపం
ఒక మంచి ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం, దాన్ని కొత్త ఉత్పత్తిగా లేదా సేవగా అభివృద్ధి చేయడం, స్టార్టప్‌గా తీర్చిదిద్దడం వంటి అంశాలపై డా. ఎలియా తాగరం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొత్త ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలను వివరించారు. సొంతంగా స్టార్టప్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారం గురించి తెలియజేశారు.
ఎన్సీఐఈ ఇండియా ద్వారా విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలకు అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. వినూత్న ఆలోచనలను వ్యాపారాలుగా మలచుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల సందేహాలకు సమాధానాలు
సదస్సులో విద్యార్థులు స్టార్టప్‌లు, కొత్త వ్యాపారాల ప్రారంభం, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగారు. వాటికి డా. ఎలియా తాగరం సమాధానాలిచ్చి సందేహాలను నివృత్తి చేశారు. చదువుకునే దశ నుంచే కొత్త ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన అవకాశాలను తెలుసుకోవడంపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య యూనివర్శిటీ డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, ప్రో వైస్ ఛాన్సలర్ డా. ఏ. రమేష్, రిజిస్ట్రార్ డా. జి. సురేష్ పాల్గొన్నారు.