telanagana
విద్యార్థుల ప్రతిభకు వేదికగా గాయత్రోత్సవ్ 2K26
Telanagana
10 Oct 2026
138 views
By సూర్య ప్రతినిధి
Updated : 10 Oct 2026 19:32 IST
Select Suryaa Now
మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10): విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని చాటిచెప్పేలా మేడ్చల్ పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గాయత్రోత్సవ్ 2K26 వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఓం శివ సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు, బహుమతుల ప్రదానంతో సందడిగా సాగింది.
ఆటపాటలతో అలరించిన విద్యార్థులు
జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారు విద్యాపరంగా రాణించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు.గాయత్రోత్సవ్‌లో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ ప్రతిభతో విద్యార్థులు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
ప్రతిభావంతులకు పురస్కారాలు
గత విద్యా సంవత్సరాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. కళాశాల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. విద్యా, క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించడం ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు శివ, గణేష్, శ్రీనివాస్ శర్మ, శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, సత్యనారాయణ, నరసింహారెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్ జిల్లా.