BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

సౌర వెలుగుతో తెలంగాణ – ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్

Select Suryaa Now
సౌర వెలుగుతో తెలంగాణ – ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్

పత్రికా ప్రకటన

తేదీ: 10 అక్టోబర్ 2026 | హైదరాబాద్

 

పీఎం సూర్య ఘర్ పథకంతో రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ – రూఫ్‌టాప్ సోలార్‌ను సద్వినియోగం చేసుకోవాలని TGSPDCL విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 10: గృహ వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ (TGSPDCL) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana – PMSGMBY) ద్వారా అర్హులైన గృహ వినియోగదారులకు కేంద్ర ఆర్థిక సహాయం (CFA) అందుబాటులో ఉందని తెలిపింది. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి ప్రోత్సాహం లభించడంతో పాటు, విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు రూ.78,000 వరకు సబ్సిడీ

పీఎం సూర్య ఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులు 3 కిలోవాట్ల (kWp) సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే గరిష్ఠంగా రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ పొందవచ్చు. మొదటి 2 కిలోవాట్ల సామర్థ్యానికి కిలోవాట్‌కు రూ.30,000 చొప్పున, తదుపరి 1 కిలోవాట్‌కు రూ.18,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. 3 కిలోవాట్లకు మించిన సామర్థ్యంపై అదనపు కేంద్ర సబ్సిడీ ఉండదు. సబ్సిడీ పొందేందుకు పథకానికి సంబంధించిన అర్హతలు, సాంకేతిక ప్రమాణాలు పాటించాలి.

అపార్ట్‌మెంట్లు, కాలనీలకూ సౌర విద్యుత్ ప్రోత్సాహం

గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (GHS/RWA) ఉమ్మడి సౌకర్యాలు, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వంటి అవసరాల కోసం ఏర్పాటు చేసే రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలకు కూడా నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. ఈ విభాగంలో కిలోవాట్‌కు రూ.18,000 చొప్పున, గరిష్ఠంగా 500 కిలోవాట్ల సామర్థ్యం వరకు, ఒక్కో ఇంటికి 3 కిలోవాట్ల పరిమితికి అనుగుణంగా సహాయం అందుతుంది. పథకం కింద సబ్సిడీ పొందాలంటే దేశీయంగా తయారైన సోలార్ సెల్స్‌తో రూపొందించిన మాడ్యూల్స్‌ (Domestic Content Requirement – DCR) వినియోగించడం సహా నిర్దేశిత నిబంధనలను పాటించాలి.

ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోండి

వినియోగదారులు పీఎం సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మొబైల్ నంబర్, విద్యుత్ కనెక్షన్ వివరాలతో పోర్టల్‌లో నమోదు చేసుకుని, సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థను ఎంపిక చేసి దరఖాస్తు సమర్పించాలి. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత పథకంలో నమోదైన విక్రేత ద్వారా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయించుకోవాలి. అనంతరం నెట్ మీటరింగ్, తనిఖీ, కమిషనింగ్ ప్రక్రియలను పూర్తి చేసి అవసరమైన వివరాలను పోర్టల్‌లో సమర్పించాలి. అర్హత నిర్ధారణతో పాటు నిర్దేశిత ప్రక్రియ పూర్తయిన తర్వాత సబ్సిడీ నిబంధనల ప్రకారం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

వినియోగదారుల సౌకర్యార్థం TGSPDCL ప్రత్యేక చర్యలు

రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటును మరింత సులభతరం చేసేందుకు TGSPDCL తన పోర్టల్‌ను పీఎం సూర్య ఘర్ పోర్టల్ 2.0తో అనుసంధానించింది. 10 కిలోవాట్ల వరకు సామర్థ్యం గల వ్యవస్థలకు సాంకేతిక సాధ్యతా అధ్యయనం నుంచి మినహాయింపు, నిబంధనలకు అనుగుణంగా ఆటోమేటిక్ లోడ్ పెంపు వంటి సౌకర్యాలను అమలు చేసింది. సోలార్ వ్యవస్థల త్వరిత ఏర్పాటుకు తనిఖీ ప్రక్రియను సరళీకరించడంతో పాటు, లోడ్ పెంపు ఛార్జీలను తదుపరి విద్యుత్ బిల్లుల ద్వారా వసూలు చేసే వెసులుబాటు కల్పించింది. నెట్ మీటరింగ్ ఒప్పందంతో సహా నిర్దేశిత పత్రాల సమర్పణలో వర్తించే మినహాయింపులను అమలు చేస్తోంది. 10 కిలోవాట్ల వరకు వ్యవస్థలకు సంబంధించి, 2026 జూన్ 22 నుంచి 2027 మార్చి 31 వరకు నమోదైన దరఖాస్తులకు వర్తించే నిబంధనల ప్రకారం దరఖాస్తు ఫీజు మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సోలార్ విక్రేతలు, TGREDCO, REC అధికారులతో ప్రతి నెలా మొదటి బుధవారం సమావేశాలు నిర్వహిస్తోంది.

సేవా సేతు శిబిరాలతో ప్రజలకు అవగాహన

పథకం ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు TGSPDCL అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో డివిజన్ స్థాయిలో సేవా సేతు శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు, ఇప్పటికే రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు తమ అనుభవాలను పంచుకున్నారు. పథకానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ స్థానిక మీడియా, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రజలు దరఖాస్తు ప్రక్రియను సులభంగా అర్థం చేసుకుని పథక ప్రయోజనాలను పొందేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.

20.33 లక్షల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ – తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం

రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ (ULA) విధానంలో 20.33 లక్షల గృహాలకు మొత్తం 4,066 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి 2025 నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమానికి TGREDCO అమలు సంస్థగా వ్యవహరిస్తోంది. గృహ జ్యోతి పథకాన్ని పీఎం సూర్య ఘర్‌తో అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో TGSPDCL పరిధిలోని 10,11,533 గృహాలకు సంబంధించి 2,023 మెగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. మొదటి విడతలో 20,175 సోలార్ ఇన్‌స్టాలేషన్లకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది.

గ్రామాల సోలారైజేషన్‌కు రూ.943.47 కోట్ల మంజూరు
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ.ఆర్టీ. నెం.23, తేదీ 09.05.2025, జీ.ఓ.ఆర్టీ. నెం.49, తేదీ 17.11.2025 ద్వారా రూ.943.47 కోట్ల పరిపాలనా మంజూరు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో 80 గ్రామాల్లోని 40,349 గృహాలకు సుమారు 81 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో TGSPDCL పరిధిలోని 43 గ్రామాల్లో 14,898 గృహాలు ఉన్నాయి. అదేవిధంగా 16,805 వ్యవసాయ పంపుసెట్లకు సుమారు 126 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ సదుపాయం కల్పించే కార్యక్రమం చేపట్టారు. వీటిలో TGSPDCL పరిధిలో 8,964 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి.

TGSPDCL పరిధిలో సౌర విద్యుత్ కార్యక్రమాల పురోగతి
2026 అక్టోబర్ 9 నాటికి TGSPDCL పరిధిలో నెట్ మీటరింగ్ విభాగంలో 30,259 నమోదు కాగా, 29,777 వ్యవస్థలు ఏర్పాటు చేసి 640.852 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద 44,662 నమోదు కాగా, 29,816 వ్యవస్థలు ఏర్పాటు చేసి 125.613 మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించారు. మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమంలో 4,335 నమోదు కాగా, 3,190 వ్యవస్థలు ఏర్పాటు చేసి 6.407 మెగావాట్ల సామర్థ్యం నమోదైంది. పీఎం కుసుమ్ కాంపోనెంట్-A కింద 720 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPAs) కుదరగా, 35 వ్యవస్థలు ఏర్పాటు చేసి 59 మెగావాట్ల సామర్థ్యం నమోదైంది.
ఈ వివరాల ప్రకారం, పేర్కొన్న విభాగాలన్నింటిలో కలిపి 79,976 నమోదులు, 62,818 ఇన్‌స్టాలేషన్లు, 831.872 మెగావాట్ల సామర్థ్యం నమోదైనట్లు TGSPDCL గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సౌర విద్యుత్‌తో విద్యుత్ పొదుపు – పర్యావరణ పరిరక్షణ

రూఫ్‌టాప్ సోలార్ ద్వారా గృహ వినియోగదారులు తమ విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల గ్రిడ్ నుంచి తీసుకునే విద్యుత్ పరిమాణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వినియోగానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించినప్పుడు, వర్తించే నిబంధనలు, నెట్ మీటరింగ్ విధానం ప్రకారం ప్రయోజనాలు పొందవచ్చు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చు.

ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆలోచనలకు అనుగుణంగా హరిత ఇంధన విస్తరణ
ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గృహ వినియోగదారులు రూఫ్‌టాప్ సోలార్‌ను స్వీకరించడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భాగస్వాములు కావచ్చని TGSPDCL పేర్కొంది.


TGSPDCL సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ గారు మాట్లాడుతూ అర్హులైన గృహ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ పథకం కింద అందుబాటులో ఉన్న కేంద్ర సబ్సిడీ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు TGSPDCL నిరంతరం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకుంటూ, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంపొందించడంలో ప్రతి గృహ వినియోగదారుడు భాగస్వామి కావాలి” అని TGSPDCL సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ గారు  పిలుపునిచ్చారు.

ప్రజలకు TGSPDCL విజ్ఞప్తి
అర్హులైన గృహ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని TGSPDCL విజ్ఞప్తి చేస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు https://pmsuryaghar.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు, మార్గదర్శకత్వం కోసం సమీపంలోని విద్యుత్ సెక్షన్ లేదా డివిజన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

సౌర విద్యుత్‌ను స్వీకరించండి – విద్యుత్ ఖర్చులను తగ్గించుకోండి – హరిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి.