యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి
దేవరుప్పుల, మేజర్ న్యూస్, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని దేవరుప్పుల మండల యువజన అధ్యక్షుడు బానోత్ నవీన్ నాయక్ పిలుపునిచ్చారు. యువతీ యువకులు, పట్టభద్రులు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తు, పట్టభద్రుల ఆకాంక్షలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. తమ ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం పట్టభద్రులకు ఉందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి నవంబర్ 1, 2023 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని నవీన్ నాయక్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని, యువత తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు గుండె రమేష్, బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు పందెనబోయిన మధు ముదిరాజ్, దాసగాని భారత్, ఉప్పుల సామ్రాట్, బట్ట వేణు, జోగు కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ,ఎల్లేష్ ,దేవరుప్పుల, జనగామ జిల్లా