దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
దేవరుప్పుల, మేజర్ న్యూస్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సోమవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల పరేడ్, కిట్ తనిఖీతో పాటు పోలీస్ స్టేషన్ ప్రాంగణం, నేరాలకు సంబంధించిన వాహనాలు, రికార్డులు, సీడీ ఫైళ్లు, పీటీ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడిన ఏసీపీ.. అన్ని కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, నిర్ణీత కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో పాలకుర్తి సీఐ భారత్ సుమన్, దేవరుప్పుల ఎస్‌ఐ సృజన్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.