పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం
కె.గంగవరం మేజర్ న్యూస్ :గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు,ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా శనివారం కే.గంగవరం మండలం యర్రపోతవరం గ్రామం నుండి వెంకటాయపాలెం బ్రిడ్జి నుంచి రామనర్సతోట మీదుగా యర్రపోతవరం వరకు రూ.1.10కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ రహదారి అభివృద్ధివల్ల ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది.ఈ మండలంలో కోటిపల్లి గ్రామంలో కుమ్మరిసావరంవరకు ఐదు పేటలకు సంబంధించిన సీసీ అప్రోచ్ రోడ్డుకు రూ.1.21కోట్లు, సోమేశ్వరస్వామి టెంపుల్ కు వెళ్లే రోడ్డు రూ.90 లక్షలు అంచనా వ్యయంతో మొత్తం రూ.4.02 కోట్లతో చేపట్టనున్న పనులకు సత్యం శంకుస్థాపన చేశారు. పుష్కరాల నేపథ్యంలో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం, భక్తులు, స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి మంత్రి సుభాష్ ప్రత్యేక ప్రాధాన్యం ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.ప్రజలకు అవసరమైన రహదారులు,డ్రైనేజీలు,తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ప్రజల అవసరాలను గుర్తించి,నిధులను సద్వినియోగం చేస్తూ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని,గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనీ సత్యం పేర్కొన్నారు.మొత్తం మూడు గ్రామాల్లో నాలుగు రోడ్లుకు గాను రూ.4.02 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని సత్యం వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈఈ కె.శ్రీనివాస్, ఏఈ దాసరి ఏసురత్నం, ప్రచార కార్యదర్శి చిల్లి నాగేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వెంటూరి వీరారాఘవలు చౌదరి, స్టేట్ డైరెక్టర్లు సలాది రమేష్, పెంకే అన్నపూర్ణ, సాంబశివరావు, నిడదవోలు సుబ్రహ్మణ్యం, బీజేపీ కర్రి చిట్టీబాబు, గొడవర్తి రామకృష్ణ, పప్పుల సాయిబాబు, ములకల రామచంద్రరావు, ఎం.పుణ్యమూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు.