ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సూర్య-గోదావరిఖని:రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఇక్కడి కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
స్కూల్ ఆటోలు, వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా తనిఖీలు నిర్వహించాలని, వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ల లైసెన్సులు, స్పీడ్ గవర్నర్లు, భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరంతరం అవగాహన కల్పించాలని సీపీ సూచించారు.
------