యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం :
ఎస్‌కేఆర్ మహిళా కళాశాల ప్రాంగణంలో వికాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినులకు ఆయన అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు అభినందనలు తెలిపారు. ఈసారి అవకాశం రాని వారు నిరాశ చెందకుండా, ఈ జాబ్ మేళాను ఒక మంచి అనుభవంగా తీసుకుని తదుపరి అవకాశాలకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని సూచించారు. రాజమహేంద్రవరంలో యువత కోసం భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ పొందాలని, నైపుణ్యాలు పెంపొందించుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో యువత అందుకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగం రాలేదని, కుటుంబ సమస్యలు ఉన్నాయని ఎవరూ మానసికంగా కుంగిపోవద్దని, చెడు సావాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు విద్యావంతులై ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, వారి భద్రత, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వికాస సంస్థ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల నిర్వాహకులను ఆయన అభినందించారు.