స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
చీపురుపల్లి మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా చూడటంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ చిత్తశుద్ధితో ఉందని శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. స్థానిక తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళా వెంకటరావు మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో స్థానం కల్పిస్తే, 1995లో నారా చంద్రబాబు నాయుడు దానిని 34 శాతానికి పెంచి బీసీలను నాయకులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. నేడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు జీవోలు జారీ చేసి 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించిందన్నారు. అయితే, గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి వేలాది మంది బీసీల రాజకీయ అవకాశాలను దెబ్బతీసిందని, ఇప్పుడు కూడా దొడ్డిదారిన కోర్టుల్లో పిటిషన్లు వేయించి 34 శాతం కోటాను అడ్డుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీసీ వ్యతిరేక కుతంత్రాలను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. బీసీల హక్కులు, ప్రాతినిధ్యం కోసం తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా న్యాయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.