గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం
- రాయలసీమలో ఉద్యానవన రంగానికి ఊతం
- బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి హర్షం
మదనపల్లె : రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని,ఉద్యానవన రంగానికి ఇది ఊతమిస్తుందని భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రమణా రెడ్డి(గోల్డెన్ వ్యాలీ విద్యాసంస్థల చైర్మన్),యువనాయుడు శ్రీకాంత్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరువుకి ప్రసిద్ధిగాంచిన రాయలసీమను సిరులు సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.లక్ష కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 40 శాతం,ప్రైవేట్ భాగస్వామ్యం 60 శాతం ఖర్చు చేయనున్నారని తెలిపారు.ఈ ప్రాజెక్టుతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రమణా రెడ్డి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమలో పది జిల్లాల్లో విస్తరించనున్నదన్నారు.ఉద్యానవన పంటల సాగును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతులకు ఒక వరం లాంటిదన్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్,వ్యాపార దిగ్గజం అనంత్ అంబానీలు ఒకే వేదికపై చేరడం అద్భుత ఘట్టమన్నారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానమన్నారు.