గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన
సూర్య గోపాలపురం ,మేజర్ న్యూస్: గోపాలపురం మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం మహిళా భద్రత, మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, దేవరపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ నాయక్ పర్యవేక్షణలో గోపాలపురం ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఈ శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
అభివృద్ధికి విద్యే ఆయుధమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని ఎస్ఐ సూచించారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు ఉంటే నిర్భయంగా పోలీసులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని కూడా ఆయన చెప్పారు.
మహిళల భద్రత, బాల్య వివాహాల నిరోధంపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసు వర్గాలు తెలిపాయి. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.