పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
-- వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్.
భూపాలపల్లి సూర్యప్రతినిధి అక్టోబర్ 3,మేజర్ న్యూస్.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గోదావరి నది తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాలకు సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య శిబిరాలు, గజ ఈతగాళ్లు, పార్కింగ్, పోలీసు బందోబస్తు తదితర సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం పుష్కర క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, వాహనాల పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
పుష్కరాల సమయంలో సమీప జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి వచ్చే అవకాశం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపడతామని కలెక్టర్ తెలిపారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, రద్దీ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నదిలో స్నానాలు చేసే భక్తుల భద్రతకు గజ ఈతగాళ్లు, అవసరమైన రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు.అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తించాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు.