క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న టీజీఎస్పీడీసీఎల్
ప్రజాబాట – బస్తీబాట ద్వారా వేలాది విద్యుత్ సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్, అక్టోబర్ 3:
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ నాయకత్వంలో నిర్వహిస్తున్న “ప్రజాబాట – బస్తీబాట” కార్యక్రమం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో విశేష ఫలితాలను సాధిస్తోంది.
విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి తక్షణ పరిష్కారం అందించడం లక్ష్యంగా ప్రతి మంగళవారం, గురువారం అధికారులు నేరుగా ప్రజలతో మమేకమవుతూ గ్రామాలు, బస్తీలు, కాలనీలలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను వెంటనే పరిశీలించి పరిష్కార చర్యలు చేపడుతున్నారు.
01 ఏప్రిల్ 2026 నుండి 01 అక్టోబర్ 2026 వరకు ప్రజాబాట – బస్తీబాట కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రధాన పనులు ఇవి:
డీటీఆర్ ఏబీ స్విచ్‌ల మరమ్మతులు – 5,521
డీటీఆర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌ల మార్పిడి – 2,885
డీటీఆర్ కేబుల్‌ల మార్పిడి – 4,924
హెచ్‌జీ ఫ్యూజ్ సెట్ల మరమ్మతులు – 3,870
డీటీఆర్ ప్లింత్ ఎత్తు పెంపు పనులు – 2,498
యార్డ్ క్లీనింగ్ పనులు – 16,827
వదులైన విద్యుత్ లైన్ల సరిదిద్దడం, స్పేసర్ల ఏర్పాటు – 16,832
విద్యుత్ లైన్లపై పెరిగిన తీగలు, వృక్షలతల తొలగింపు – 8,384
చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ కట్టింగ్) – 5,317
వంగిన, ఒరిగిన విద్యుత్ స్తంభాల సరిదిద్దడం – 6,399
మొత్తంగా 73,457కు పైగా నిర్వహణ, భద్రతా మరియు వినియోగదారుల సేవలకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరిగింది.
సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, విద్యుత్ సేవల నాణ్యతను మెరుగుపరచడం, అంతరాయాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం లక్ష్యంగా ప్రజాబాట – బస్తీబాట కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని వేగవంతమైన పరిష్కారం అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందన్నారు.
విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 కాల్ సెంటర్, స్థానిక విద్యుత్ అధికారులను లేదా ప్రజాబాట – బస్తీబాట కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రజల వద్దకు సేవలు – ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ ముందుకు సాగుతోందని తెలిపారు.