సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్
తల్లి–శిశు సంక్షేమానికి ప్రాధాన్యం.. 5 దరఖాస్తుల్లో 3కు ఆమోదం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్, 03):సరోగసీ ప్రక్రియలో వైద్యపరమైన అవసరం, చట్టబద్ధత, పారదర్శకత, నైతిక ప్రమాణాలు, భవిష్యత్ తల్లి–శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ తెలిపారు.అర్హత కలిగిన దంపతులకు మాత్రమే పూర్తి వైద్యపరమైన, చట్టబద్ధమైన పరిశీలన అనంతరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ఏఆర్టి / సరోగసీ బోర్డు సమావేశం డాక్టర్ కె. ఆనంద్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు.
వైద్యపరమైన అంశాలపై సమగ్ర పరిశీలన
గర్భధారణకు సంబంధించిన వైద్యపరమైన సమస్యలు, గర్భస్థ శిశువును మోసే సామర్థ్యం, ఇతర ప్రత్యామ్నాయ చికిత్సల అవకాశాలు తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలత, శిశు వైద్య నిపుణులు డాక్టర్ శివ కిరణ్ పాల్గొన్నారు.
5 దరఖాస్తుల్లో 3కు ఆమోదం:
సరోగసీకి సంబంధించిన మొత్తం ఐదు దరఖాస్తులను బోర్డు సమగ్రంగా పరిశీలించింది. సరోగసీ (నియంత్రణ) చట్టం–2021 నిబంధనలు, నిర్దేశిత వైద్య ప్రమాణాలు, దరఖాస్తుదారుల అర్హతలు, సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం మూడు దరఖాస్తులకు ఆమోదం తెలిపి వైద్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది.
అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు:
సరోగసీ ప్రక్రియలో అక్రమాలు, దుర్వినియోగం, వాణిజ్య ప్రయోజనాలకు తావులేకుండా చట్టపరమైన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. ప్రతి దరఖాస్తును వైద్య, చట్టపరమైన అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
రిపోర్టర్ బాల్ రెడ్డి.