ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలో బోర్డు
మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం..
ఆటో ఛార్జీని కిలోమీటర్‌కు రూ.14కు పెంచాం
2014 తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదు..
ఉద్యమాలు చేసినా నాటి పాలకులు స్పందించలేదు
ప్రజా భవన్ లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులకు ఆత్మీయ విందు ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరిరి లక్ష్మణ్
ఆటో కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలన్నింటినీ మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలనే అజెండాగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
శనివారం రాత్రి ప్రజాభవన్‌లో హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆత్మీయ విందు ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆటో సంఘాల నాయకులతో భోజనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లోతుగా అధ్యయనం చేసి కేబినెట్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆటో ఛార్జీల పెంపుపై డ్రైవర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. కేబినెట్‌లో చర్చించి కిలోమీటర్‌కు రూ.11గా ఉన్న ఛార్జీని రూ.14కు పెంచుతూ జీఓ జారీ చేసిందన్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆటో ఛార్జీని కిలోమీటర్‌కు రూ.11గా నిర్ణయించిందని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న పాలకులు ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. డ్రైవర్లు అనేక ఉద్యమాలు చేసినప్పటికీ వారిని పిలిచి మాట్లాడటం, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించడం జరగలేదన్నారు.
సంక్షేమ బోర్డుపై కేబినెట్‌లో చర్చ
రవాణా రంగంలో దాదాపు 20 లక్షల కార్మిక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారి సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని చెప్పారు. చట్టసభల్లో చర్చించి, అవసరమైన నిధులు కేటాయించే ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లు కోరుతున్న ఇతర అంశాలపైనా కొంత సమయం తీసుకుని న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రస్తుతం పెంచిన రూ.14 ఛార్జీ సరిపోతుందా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
ప్రజల అజెండాతో ప్రజా ప్రభుత్వం
కేవలం జీఓలు జారీ చేసి ప్రచారం చేసుకోవడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని అన్నారు. ప్రజాభవన్‌కు ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులను ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ సమావేశం ఉద్దేశమన్నారు. ప్రభుత్వం తమది, ప్రజలదే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు.
డీజిల్ ఆటోలకు బదులు బ్యాటరీ ఆటోలు
హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. నగరంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. డీజిల్ ఆటోలను బ్యాటరీ ఆటోలుగా మార్చేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రూ.200 కోట్లను కేటాయించామని తెలిపారు. ఒక్కో ఆటోకు ప్రభుత్వం తరఫున రూ.1.50 లక్షల సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సోలార్, బ్యాటరీ, సీఎన్‌జీ ఆటోలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను భట్టి విక్రమార్క అభినందించారు.