శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు
సూర్య జాతీయ డెస్క్: ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ముంబైలో చేపట్టిన ఆందోళనకు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు పలికారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న శివాజీ పార్క్‌లో జరిగిన "జైల్ భరో" కార్యక్రమానికి సీనియర్ నటి షబానా ఆజ్మీ హాజరై ప్రసంగించారు. పోలీసులు అనుమతి నిరాకరించి, బారికేడ్లు ఏర్పాటు చేసినా, తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా వేలాది మంది యువత ఈ నిరసనలో పాల్గొన్నారు.
ప్రసంగంలో షబానా ఆజ్మీ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నప్పుడు ఓటు హక్కుతో పాటు నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రశ్నించడం పౌరుల బాధ్యతని ఆమె స్పష్టం చేశారు. ఆమె భర్త, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో కలిసి శివాజీ పార్క్‌కు చేరుకున్నారు. సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ కూడా నిరసనలో పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకుడు విశాల్ భరద్వాజ్, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విద్యార్థి సంఘాలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు మద్దతు తెలిపారు. షబానా ఆజ్మీ ఇంతకుముందు ఢిల్లీలో జరిగిన నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఈ నిరసనల నేపథ్యంలో ముంబై పోలీసులు శనివారం సీజేపీ సభ్యులు, మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా శివాజీ పార్క్‌లో గుమిగూడడం, అనధికారికంగా లౌడ్‌స్పీకర్లు వాడడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాల్సి ఉంది. అంతకుముందు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను గురువారం ముంబై పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై తమ ఆందోళన కొనసాగుతుందని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల సంఘం మాత్రం ఈ ప్రక్రియపై కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని వివరణ ఇచ్చింది. వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మొదలైన సీజేపీ ఆందోళనకు సినీ రంగ ప్రముఖులు, యువత మద్దతు తోడవడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఏ దిశగా సాగుతుందో వేచి చూడాల్సి ఉంది.