సింగరేణి కార్మికులకు రూ.1.10 లక్షల దీపావళి (పీఎల్ఆర్) బోనస్
సూర్య-గోదావరిఖని:సింగరేణి బొగ్గు గని కార్మికులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పీఎల్ఆర్) రూ.1,10,250 చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కోల్ ఇండియా (సిఐఎల్) ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో శనివారం కేంద్ర కార్మిక సంఘాలు, సిఐఎన్-సింగరేణి యాజమాన్య ప్రతినిధుల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం పనితీరును పరిగణనలోకి తీసుకుని అర్హత కలిగిన నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగులకు ప్రో-రాటా ప్రాతిపదికన రూ.1,10,250 చెల్లించాలని నిర్ణయించారు. సిఐఎల్, దాని అనుబంధ సంస్థలతో పాటు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కోల్ ఇండియాలో ఈ బోనస్ ను అక్టోబర్ 15లోగా చెల్లింపు చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే సింగరేణి కాలరీస్‌లో దీపావళి ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా, చెల్లింపు తేదీని త్వరలో యాజమాన్యం ప్రకటించనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 815 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 850 మిలియన్ టన్నుల డిస్పాచ్ లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు ఉద్యోగులకుపిలుపునిచ్చాయి.
---------