'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆధ్వర్యంలోని కృత్రిమ మేధస్సు (AI) విభాగాన్ని 'స్పేస్‌ఎక్స్ ఏఐ' (SpaceXAI) నుండి 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ' (SpaceXSI) గా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ యూజర్ చేసిన సూచనకు స్పందిస్తూ మస్క్ ఈ రీబ్రాండింగ్‌ను ధృవీకరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రభుత్వ సమాచార మార్పిడి మరియు అధికారిక పత్రాల్లో 'కృత్రిమ మేధస్సు' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI) అనే పదానికి బదులుగా 'సూపర్ ఇంటెలిజెన్స్' (Super Intelligence - SI) అనే పదాన్ని వాడాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ నూతన విధానానికి అనుగుణంగానే మస్క్ తన కంపెనీ పేరులో 'AI' స్థానంలో 'SI'ని చేర్చుతామని ప్రకటించడం గమనార్హం.
గతంలో 'ఎక్స్ ఏఐ' (xAI) గా ఉన్న సంస్థను స్పేస్‌ఎక్స్ కొనుగోలు చేసిన తర్వాత జూలై నెలలో 'స్పేస్‌ఎక్స్ ఏఐ'గా మార్చారు. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI) నినాదానికి మద్దతుగా మరోసారి పేరు మారుస్తుండటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ పేరు మార్పు కేవలం కంపెనీ నామకరణానికే పరిమితమా లేక గ్రోక్ (Grok) చాట్‌బాట్ వంటి సేవల్లోనూ మార్పులుంటాయా అనే దానిపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.