ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : జిల్లా ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దీనిలో భాగంగా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను అక్టోబర్ 5, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించే సమయంలో పేరు, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌తో పాటు సమస్యకు సంబంధించిన సమగ్ర వివరాలను స్పష్టంగా పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. సమస్యకు సంబంధించిన ఆధార పత్రాలు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను అర్జీతో పాటు జతచేయాలని తెలిపారు. ఇప్పటికే ఇదే సమస్యపై గతంలో ఫిర్యాదు చేసిన వారు తమ పాత అర్జీ రశీదు/ఫిర్యాదు రసీదును వెంట తీసుకురావాలని సూచించారు. దీనివల్ల పాత ఫిర్యాదు వివరాలను పరిశీలించి, తదుపరి చర్యలను వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు వ్యక్తిగతంగా హాజరై అర్జీ సమర్పించలేని ప్రజలు కూడా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న 1100 టోల్‌ఫ్రీ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్జీల స్వీకరణ ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు డివిజన్, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తమ ప్రాంతానికి సమీపంలోని సంబంధిత కార్యాలయాలను ప్రజలు సంప్రదించి సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.