రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం!
సీతమ్మధార,మేజర్ న్యూస్ : ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ విలువల పరిరక్షణ, ఓటర్ల జాబితా సవరణల్లో అవకతవకలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించింది.
జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ రూపకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా హాసిని వర్మ మాట్లాడుతూ.. బీజేపీ వంటి కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగంపై దాడికి కుట్రలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ మూడోసారి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు నాలుగోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటోందని విమర్శించిన ఆయన, దేశవ్యాప్తంగా పేదలు, గిరిజనులు, ఆదివాసీలకు చెందిన 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.గత మూడు పర్యాయాలు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వాన్ని నాలుగోసారి ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, దేశాన్ని కాపాడటం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడి జన్మహక్కు అని, దానిని కాలరాయడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో యువత, మహిళలు, దళితులు, మైనారిటీలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోడదాసి సుధాకర్, పీసీసీ సెక్రటరీ గాదం మహేష్, భీమిలి ఇంచార్జి సవరివిల్లి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనంద్ కుమార్, యువజన కాంగ్రెస్ కార్యదర్శి కే. జాహ్నవి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.