కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన!
కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన!
నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :
నెల్లూరు రూరల్ మండలం కొమ్మరపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారనే ఆరోపణలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, కొమ్మరపూడి ప్రజానీకం పాల్గొని ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ షాన్వాస్, షేక్. మున్నా , సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి. లీలా మోహన్ , వై ఆదినారాయణ లు మాట్లాడుతూ , కొమ్మరపూడి గ్రామపంచాయతీ సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ముగ్గురు , రెండేసి సెట్ల చొప్పున మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు చేయగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్లను తిరస్కరించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. నామినేషన్ల తిరస్కరణకు సరైన కారణాలు, నిబంధనల ఆధారంగా వివరణ ఇవ్వాల్సిన అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదని వారు ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు . అలాంటి హక్కును అధికారుల ఇష్టారాజ్యానికి, అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు బలిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో కలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు.
సీపీఐ ప్రధాన డిమాండ్లు:
1. కొమ్మరపూడి గ్రామపంచాయతీ నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరపాలి.
2. నామినేషన్లను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి.
3. సంబంధిత వ్యవహారంలో బాధ్యత వహించిన నెల్లూరు ఆర్డీవోపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి.
4. నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన కారణాలు, ఎన్నికల నిబంధనల ఆధారాలను బహిర్గతం చేయాలి.
5. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా ఎన్నికల చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.
6. భవిష్యత్తులో ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని అరికట్టి పారదర్శకమైన ఎన్నికలకు హామీ ఇవ్వాలి.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎన్నికల ప్రక్రియలో అధికార దుర్వినియోగం, రాజకీయ జోక్యాన్ని సీపీఐ ఎంతమాత్రం సహించబోదని నాయకులు హెచ్చరించారు. కొమ్మరపూడి గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోట్లూరి నరసయ్య, ఉప్పునూతల జనార్ధన్ , పెట్లూరు శ్రీనివాసులు , కాకి రవీంద్ర , కొర్రా రఫీ , రెట్టపల్లి ప్రసాద్ మరియు 150 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.